Stampede – మహాకుంభమేళ తొక్కిసలాటలో 20కి పెరిగిన మరణాలు…
త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట
20 మంది భక్తులు మృతి
100 మందికి పైగా గాయాలు
కొనసాగుతున్న సహాయక చర్యలు
మౌనీ అమావాస్య సందర్భంగా 10 కోట్ల మంది భక్తుల రాక
రద్దీ కారణంగా బారికేడ్ల విరగడంతో ప్రమాదం
స్పందించిన సీఎం యోగి ఆదిత్యనాథ్
త్రివేణి సంగమ ఘాట్‌లో స్నానాలు నిషేధం
ఇతర ఘాట్‌లకు భక్తుల మళ్లింపు
ఇప్పటికే 8 కోట్ల మంది పుణ్య స్నానాలు
ఘటనపై ప్రధాని, రాష్ట్రపతి దిగ్బ్రాంతి
ప్రయాగ రాజ్‌కు రైళ్లు, బస్సు సర్వీస్‌లు రద్దు
నేటి పుణ్య స్నానాలను వాయిదా వేసుకున్న అఖడాలు
ప్రయాగరాజ్, ఆంధ్రప్రభః ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో అంగరంగ వైభవంగా కొనసాగుతున్న మహా కుంభ మేళాలో నేడు అపశృతి చోటు చేసుకుంది. త్రివేణి సంగమం వద్ద తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇప్పటివరకు 20మంది భక్తులు మరణించారు. మరో వంద మంది గాయపడ్డారు. మౌని అమావాస్యను పురస్కరించుకుని మూడో అమృత స్నానం కోసం పెద్ద సంఖ్యలో ప్రయాగ్ రాజ్‌కు భక్తులు తరలిరావడంతో బుధవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తొక్కిసలాట చోటు చేసుకుంది. దీంతో సెక్టార్-2లోని భక్తుల తాకిడికి బారికేడ్లు విరిగి భారీ తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో సుమారు 20 మంది మృతి చెందగా.. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని భయపడుతున్నారు.
గాయపడిన వారిని ఆస్పత్రికి తరలింపు..
ఘటన జరిగిన వెంటనే స్పందించిన సిబ్బంది.. గాయపడిన వారిని చికిత్స కోసం అంబులెన్సుల్లో సమీప ఆస్పత్రులకు తరలించారు. గాయపడిన వారికి అత్యవసర చికిత్స అందిస్తున్నారు. కాగా ఈ ఘటన జరిగిన వెంటనే త్రివేణి సంగమం ఘాట్‌ను మూసివేశారు. ఈ ఘాట్‌కు భక్తులు రావద్దని, ఇతర ఘాట్ లలో పుణ్య స్నానాలు ఆచరించాలని మైకులలో ప్రచారం చేశారు.
పరిస్థితి అదుపులోనే ఉంది… ముఖ్యమంత్రి యోగి
ఇది ఇలా ఉంటే . ఈ ఘటన పట్ల ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేసింది. సమగ్ర విచారణకు ఆదేశించింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు, విపత్తు నిర్వహణ సిబ్బంది రంగంలోకి దిగారు. సహాయక చర్యలు చేపట్టారు. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్ మహాకుంభ మేళాలో సంగం ఒడ్డున జరిగిన తొక్కిసలాటపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. సంగం, అఖారా మార్గ్ వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉందని తెలిపారు. ప్రజలు పుకార్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేస్తూ, పోలీసులు, పరిపాలనా యంత్రాంగం అప్రమత్తంగా పని చేస్తోందని ఆయన స్పష్టం చేశారు. భక్తులు ఎక్కడ ఉన్నా అక్కడే స్నానం చేయొచ్చని, ప్రత్యేకంగా త్రివేణి సంగమం వద్దకే రావాల్సిన అవసరం లేదని సీఎం యోగి తెలిపారు.
నేడే ఏకంగా 8 కోటి పుణ్య స్నానాలు..
మీడియాతో మాట్లాడిన సీఎం యోగి ఆదిత్యనాథ్.. మహాకుంభ మేళాలో నిన్న ఒక్కరోజే 5.5 కోట్ల మంది పవిత్ర స్నానం చేశారని వెల్లడించారు. అలాగే మౌనీ అమవాస్య సందర్భంగా సుమారు 10 కోట్ల మంది భక్తులు రానుండటంతో రద్దీ వల్ల సంగం వద్ద ఒత్తిడి పెరిగిందని చెప్పారు. పరిపాలనా యంత్రాంగం అప్రమత్తంగా వ్యవహరిస్తోందని, భక్తుల భద్రత కోసం అన్నిరకాల చర్యలు తీసుకుంటున్నామని వివరించారు. బుధవారం ఉదయం అఖారా మార్గ్‌లోని బారికేడ్లను దాటేందుకు ప్రయత్నించిన భక్తుల కారణంగా తొక్కిసలాట జరిగిందని సీఎం యోగి వివరించారు. ఈ ఘటనలో కొందరు భక్తులు గాయపడగా, వారిని వెంటనే ఆస్పత్రికి తరలించి చికిత్స అందించినట్లు తెలిపారు. స్థానిక పరిపాలనా అధికారులు భద్రతా చర్యలు మరింత కట్టుదిట్టం చేశారని చెప్పారు. ఇక నేటి ఉదయానికే వివిధ ఘాట్‌లలో సుమారు ఎనిమిది కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారన్నారు.
అమృత స్నానాలు రద్దు చేసుకన్న అఖడాలు
ప్రయాగ్‌రాజ్ మహా కుంభమేళాలో తొక్కిసలాటతో అఖడా పరిషత్ కమిటీ కీలక నిర్ణయం తీసుకుంది. మౌనీ అమావాస్య సందర్భంగా అమృత స్నానాలు ఆచరించాలన్న నిర్ణయాన్ని రద్దు చేసుకుంటున్నట్లు పరిషత్ అధ్యక్షుడు రవింద్ర పూరి వెల్లడించారు. వసంత పంచమి రోజున స్నానానికి రావాలని విజ్ఞప్తి చేశారు. నాగసాధువులు, అఖడాలు తమ తమ గుడారాలలోనే ఉండాలని ఆయన విజ్ఞప్తి చేశారు. “ఈ సంఘటన జరిగినందుకు మేము బాధపడుతున్నాము. వేలాది మంది భక్తులు మా వెంట ఉన్నారు… ప్రజల ప్రయోజనాన్ని దృష్టిలో పెట్టుకుని, ఈ రోజు స్నానంలో అఖాడా పరిషత్ పాల్గొనకూడదని నిర్ణయించుకున్నాం. ప్రజలకు నా విజ్ఞప్తి, ఈ రోజు కాకుండా వసంత పంచమి రోజు స్నానానికి రావాలి” అని పూరి చెప్పారు.
రాష్ట్రపతి, ప్రధాని దిగ్బ్రాంతి..
ఈ ఘటనపై రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ప్రధానమంత్రి నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళాలో తొక్కిసలాట ఘటన బాధాకరం. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నా అని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము పేర్కొన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్పందిస్తూ..
ఈ ఘటన కలచివేసిందని, అక్కడి పరిస్థితులను ఎప్పటికప్పుడు తెలుసుకుంటోన్నానని అన్నారు. మృతుల కుటుంబాలకు సానుభూతిని, సంతాపాన్ని తెలియజేశారు. “ప్రయాగ్ రాజ్ మహా కుంభమేళా లో చోటుచేసుకున్న విషాదం తీవ్ర విచారకరం. ఈ ఘటనతో తమ ప్రియమైన వారిని కోల్పోయిన భక్తులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా. బాధితులకు స్థానిక యంత్రాంగం అన్నివిధాలా సాయం చేస్తోంది. దీని గురించి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌తోనూ మాట్లాడా. రాష్ట్ర ప్రభుత్వంతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నాఅని ట్వీట్ చేశారు.
నిర్వహణ లోపంతోనే తొక్కిసలాట – రాహుల్ గాంధీ
ఈ ఘటన పట్ల లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధినేత మల్లికార్జున్ ఖర్గే స్పందించారు. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. గాయపడ్డ వాళ్లు వేగంగా కోలుకోవాలని ఆకాంక్షించారు. వారికి మెరుగైన వైద్య సహయాన్ని అందజేయాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి సూచించారు. నిర్వహణ లోపలే దీనికి కారణమని రాహుల్ గాంధీ, ఖర్గే వ్యాఖ్యానించారు. అమృత్ స్నాన్ చేయడానికి దేశం నలుమూలల నుంచి కోట్లాదిమంది భక్తులు వస్తారని తెలిసి కూడా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించిందని ఆరోపించారు. సామాన్య భక్తుల కంటే వీఐపీల సేవలో అధికారులు తరించారని విమర్శించారు. మహా కుంభమేళా ముగియడానికి ఇంకా చాలా సమయం ఉందని, అమృత్ స్నాన ఘడియలు, తేదీలు ఇంకా ఉన్నాయని, ఇలాంటి తప్పులు పునరావృతం కాకుండా ముందు జాగ్రత్తలను తీసుకోవాలని రాహుల్ గాంధీ సూచించారు. వీఐపీ కల్చర్‌కు పుల్ స్టాప్ పెట్టాలని, సామాన్యులకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు. క్షతగాత్రులకు వీలైనంత సహాయం అందజేయాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు.
ప్రత్యక రైళ్లు.. బస్సులు రద్దు
మౌనీ అమావాస్య సందర్భంగా కుంభమేళా లో విపరీతమైన రద్దీ కారణంగా తొక్కిసలాటతో దీనదయాళ్ ఉపాధ్యాయ్ జంక్షన్ నుంచి ప్రయాగ్ రాజ్ వెళ్లడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక రైళ్లను నిలిపివేసినట్లు పండిట్ దీనదయాళ్ ఉపాధ్యాయ రైల్వే డివిజన్ కమర్షియల్ మేనేజర్ మనీష్ కుమార్ తెలిపారు. అధికారుల నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు సాధారణ రైళ్లు మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంటాయని అన్నారు.
24 గంటల పాటు అనుమతి లేదు..
పుణ్యస్నానాలు ఆచరించేందుకు త్రివేణి సంగమం ఘాట్ భక్తులు వస్తున్న వాహనాలు, బస్సులను ప్రయాగ్ రాజ్ సరిహద్దుల్లో 24 గంటల పాటు నిలిపివేశామన్నారు. జిల్లా మేజిస్ట్రేట్ దినేష్ చంద్ర పేర్కొన్నారు. కుంభమేళా ప్రాంతంలో ఇప్పటికే పది కోట్ల మంది ప్రజలు ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తుండడంతో 24 గంటల పాటు ఇతరులను అనుమతించట్లేదని పేర్కొన్నారు. మరోవైపు.. ఇతర ప్రాంతాల నుంచి ప్రయాగ్‌కు వస్తున్న రైలు సర్వీస్‌లను ఆపివేయలేదని భారతీయ రైల్వే అధికారులు తెలిపారు. అయితే ప్రయోగలో రద్దీ దృష్ట్యా దీన దయాళ్ స్టేషన్‌లోనే నిలిపివేస్తున్నామన్నారు.. ఇక్కడ పరిస్థితి చక్కబడిన తర్వాతే రైళ్లను ప్రయాగకు నడుపుతామన్నారు.. ఇక తిరుగు ప్రయాణం కోసం ప్రయాగ్ రాజ్ నుంచి భక్తులను తిరిగి తీసుకువెళ్లేందుకు అదనంగా దాదాపు 360 ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేశామన్నారు. రైల్వేస్టేషన్‌లో రద్దీని ఎప్పటికప్పుడు నివారించడానికి తగిన చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్రజలు భద్రతా నియమాలు పాటించి తమతో సహకరించాలని కోరారు.