Siddipet | ఉపాధి హామీ ప‌నుల్లో అప‌శ్రుతి – త‌ల్లీకుమార్తె మృతి

సిద్ధిపేట, ఆంధ్ర‌ప్ర‌భ : సిద్ధిపేట జిల్లా అక్క‌న్న‌పేట మండ‌లం గోవ‌ర్ధ‌న‌గిరి గ్రామంలోని జ‌రుగుతున్న ఉపాధి హామీ ప‌నుల్లో నేడు అప‌శ్రుతి చోటు చేసుకుంది. మట్టిని తవ్వుతున్న క్రమంలోనే పైన ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లు పడటంతో గోవ‌ర్థ‌నిగిరి గ్రామానికి చెందిన కందార‌పు స‌రోజ‌ని (45), అన్నాజీ మ‌మ‌త (28) ప్ర‌మాదావ‌శాత్తు ప్రాణాలు కోల్పోయారు. ఈ సంఘ‌ట‌న‌తో గ్రామంలో ఒక్క‌సారిగా విషాద‌ఛాయ‌లు అలుముకున్నాయి. స‌మాచారం అందుకున్న రెవెన్యూ అధికారులు, పోలీసులు ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకుని స‌హాయ‌క చ‌ర్య‌లు చేప‌ట్టారు. జేసీబీ స‌హాయంతో శిథిలాల‌ను తొల‌గించి, మృత‌దేహాల‌ను స్వాధీనం చేసుకున్నారు.

ప్ర‌మాదం జ‌రిగిందిలా…
గోవర్ధనగిరి గ్రామానికి చెందిన కందారపు సరోజ‌ని, అన్నాజీ మమత రోజు మాదిరిగానే ఉపాధి హామీ పథకంలో భాగంగా కూలీ పనికి వెళ్లారు. మట్టిని తవ్వుతున్న క్రమంలోనే పైన ఉన్న పెద్ద పెద్ద బండరాళ్లు వారిద్ద‌రిపై పడిపోయాయి. రాళ్ల కింద ఇరుకుపోయిన వారిద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఉపాధి కూలీ రేణుక, స్వరూపలకు కాళ్లు విరిగాయి. స‌మాచారం అందుకున్న గ్రామ‌స్థులు సంఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని బండరాళ్ల మధ్య ఇరుకున్న రెండు మృత‌దేహాల‌ను గ్రామ‌స్థులు, అధికారులు, పోలీసులు సంయుక్తం జేసీబీ సాయంతో అతి కష్టం మీద బయట‌కు తీశారు. తీవ్రంగా గాయపడి కాలు విరిగిన రేణుక, స్వరూప‌లను 108 అంబులెన్స్‌లో చికిత్స నిమిత్తం హుస్నాబాద్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని ద‌ర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *