TG | స్థానిక సంస్థల ఎన్నికలు.. మంత్రులు, అధికారులతో రేవంత్ సమీక్ష.
హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గర పడడంతో సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ సమీక్ష నిర్వహించారు. హైదరాబాద్ లోని పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంట్రల్ లో జరిగిన ఈ సమీక్షలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు సీతక్క, దామోదర రాజనరసింహ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, సీనియర్ నాయకులు జానారెడ్డి, కె కెశవరావు, ప్రభుత్వం ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, పంచాయితీ రాజ్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
కాగా, సర్పంచ్ల పదవీకాలం ముగిసి ఫిబ్రవరి 1 నాటికి ఏడాది పూర్తి అవుతుంది. పంచాయతీల్లో ఏడాదిగా ప్రత్యేకాధికారుల పాలన కొనసాగుతోంది. ఫిబ్రవరిలో స్థానిక ఎన్నికల కోసం రేవంత్ రెడ్డి సర్కార్ కసరత్తు చేస్తోంది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్ల పెంపుపై తర్జన భర్జన పడుతోంది. .బీసీ డెడికేషన్ కమిషన్ నివేదిక కోసం ప్రభుత్వం ఎదురుచూస్తోంది. ఇప్పటికే కమిషన్ నివేదికను సిద్ధం చేసింది. ఈ నేపథ్యంలోనే రేవంత్ సమీక్ష నిర్వహించారు.. స్థానిక సంస్థల ఎన్నికలలో ఎలా ముందుకువెళ్లాలనే దానిపై మంత్రులు, అధికారులతో చర్చించారు.. వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు.
బీసీ డెడికేషన్ కమిషన్ ఇచ్చే నివేదిక ఆధారంగా బీసీ రిజర్వేషన్లపై నిర్ణయం తీసుకోవాలని మెజార్టీ మంత్రులు తమ అభిప్రాయాలను వెల్లడించినట్లు సమాచారం. అలాగే నాలుగు పథకాలు అమలు చేస్తున్న ఈ సమయంలోనే స్థానిక ఎన్నికలకు వెళితే ఫలితాలు అనుకూలంగా వస్తాయనే అభిప్రాయం కూడా వ్యక్తమైంది. దీంతో సాధ్యమైనంత త్వరగా రిజర్వేషన్ల ప్రక్రియను ప్రారంభించాలని రేవంత్ అధికారులను ఆదేశించారు. రిజర్వేషన్లపై ప్రభుత్వ నిర్ణయం తర్వాత ఎన్నికలకు వెళ్లాలని రేవంత్ భావిస్తునట్లు తెలిసింది.