Budget Session | రేపటి నుంచే బడ్జెట్ సమావేశాలు .. ఫిబ్రవరి ఒకటే తేదిన కేంద్ర బడ్జెట్
తొలి రోజు రాష్ట్రపతి ప్రసంగం
రెండు విడతలుగా పార్లమెంట్ సమావేశాలు
వక్ఫ్ బోర్డు తో సహా 16 బిల్లులు ప్రవేశపెట్టనున్న కేంద్రం
కేంద్రాన్ని నిలదీసేందుకు విపక్షాలు రెడీ
మహాకుంభమేలా తొక్కిసలాటపై ప్రభుత్వాన్ని నిలదీసే అవకాశం
న్యూ ఢిల్లీ – పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ సమావేశాలు రెండు విడతలుగా నిర్వహించనున్నారు. మొదటి విడత ఫిబ్రవరి 13 వరకు కొనసాగనుండగా, రెండో విడత మార్చి 10 నుంచి ఏప్రిల్ 4 వరకు జరుగుతుంది. రేపు ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పార్లమెంటు ఉభయసభలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. ఆ మర్నాడు ఫిబ్రవరి 1న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు. ఇది ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలో మూడో సారి ఏర్పడిన ప్రభుత్వం సమర్పించే మొదటి పూర్తి స్థాయి బడ్జెట్ కావడం విశేషం. ఫిబ్రవరి 3న రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాద తీర్మానంపై ఉభయ సభల్లో చర్చ ప్రారంభమవుతుంది. ఈ సమావేశాల్లో మొత్తం 27 రోజులపాటు పార్లమెంటరీ కార్యకలాపాలు జరుగనున్నాయి
అఖిలపక్ష భేటి ..
పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలోనే నేడు అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీలో కేంద్రమంత్రులు, పలు పార్టీల ఎంపీలు హాజరయ్యారు. ఈసందర్భంగా పార్లమెంట్లో ప్రవేశపెట్టే బిల్లుల జాబితాను కేంద్రం అఖిలపక్షానికి అందించింది. ఇందులో వర్ఫ్ సవరణ బిల్లు కూడా ఉంది.
బడ్జెట్ సమావేశాల్లోనే వర్ఫ్ సవరణ బిల్లును పార్లమెంట్కు తీసుకురానున్నట్లు కేంద్రం తెలిపింది. దీంతోపాటు మొత్తం 16 బిల్లులను సభల్లో ప్రవేశపెట్టనున్నట్లు వెల్లడించింది. ఆ జాబితాను అఖిలపక్షం ముందు ఉంచింది. వర్ఫ్ చట్ట సవరణపై గతంలో కేంద్రం జేపీసీని ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో రాజ్యసభ లీడర్, ఆరోగ్యశాఖ మంత్రి జెపి నడ్డా, సహాయ మంత్రులు అర్జున్ మేఘవాల్, మురుగన్ , లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ, రాజ్యసభ ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, ఇతర విపక్ష నేతలు హాజరయ్యారు..
అస్త్రశస్ర్తాలు సిద్దం చేసుకున్న విపక్షాలు..
బడ్జెట సమావేశాలలో కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీసేందుకు విపక్షాలు సిద్దమవుతున్నాయి.. కేంద్ర బడ్జెట్ ప్రణాళిక, పార్లమెంటులో ప్రజా ప్రయోజన అంశాలపై చర్చకు సమయం కేటాయింపు, రైతు సమస్యలు, ఉపాధి అవకాశాలు, ఆర్థిక విధానాలపై ప్రతిపక్షాల విమర్శలు, ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చే రంగాలు, ముఖ్య ప్రణాళికలు, ప్రభుత్వానికి ముందున్న సవాళ్లు, ప్రతిపక్షాలు ఆర్థిక వ్యూహాలు, నిరుద్యోగం, సామాజిక సంక్షేమ కార్యక్రమాలు, వివిధ రాష్ట్రాల్లో కొనసాగుతున్న రాజకీయ పరిణామాలు వంటి అంశాలపై కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే అవకాశముంది. అలాగే మహాకుంభమేళలో జరిగిన తొక్కిసలాటను విపక్షాలు ప్రధాన అస్త్రంగా చేసుకోనునట్లు సమాచారం..