TG | టూరిజం పెంచుదాం.. ఆకర్షించేలా పాలసీ !
- టూరిజంపై సీఎం సమీక్ష
- దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా పాలసీ
- ఫిబ్రవరి 10లోగా టూరిజం పాలసీ
దేశ విదేశాల్లోని అత్యుత్తమ విధానాలను అధ్యయనం చేసి తెలంగాణ టూరిజం పాలసీని రూపొందించాలని సీఎం రేవంత్ అన్నారు. ఫిబ్రవరి 10లోగా అత్యుత్తమ టూరిజం పాలసీని సిద్ధం చేయాలని ఆదేశించారు. దేశ, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా పాలసీ ఉండాలని సీఎం రేవంత్ సూచించారు.
టెంపుల్, ఎకో టూరిజంపై దృష్టి…
రాష్ట్రంలో టెంపుల్, ఎకో టూరిజంపై ప్రధానంగా దృష్టి సారించాలని సీఎం అన్నారు. ఈ సందర్భంగా ఆయా శాఖల ఉన్నతాధికారులకు సీఎం రేవంత్ పలు కీలక సూచనలు చేశారు. ఎకో టూరిజం అభివృద్ధికి అవకాశం ఉన్న ప్రాంతాలను గుర్తించి అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలని అన్నారు. సింగపూర్ తరహా ఎకో టూరిజం విధానాలను పరిశీలించాలని ఆదేశించారు.
సమ్మక్క-సారలమ్మ జాతర జరిగే సమయంలో.. భక్తులు, పర్యాటకులను ఆకర్షించేందుకు రెవెన్యూ, అటవీ, పర్యాటక శాఖలు సంయుక్తంగా ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. జాతరతోపాటు సమీపంలోని పర్యాటక ప్రాంతాలు, దేవాలయాలను కలుపుతూ సర్క్యూట్‌ను అభివృద్ధి చేయాలని అధికారులకు సీఎం సూచించారు.
గోదావరి, కృష్ణా పుష్కరాలకు పక్కా ప్రణాళికలు..
ఆదిలాబాద్, వరంగల్, నాగార్జునసాగర్ వంటి ప్రాంతాల్లో ఎకో టూరిజంను మరింత అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. ఇక రానున్న గోదావరి, కృష్ణా పుష్కరాలకు దేశం నలుమూలల నుంచి భక్తులు, పర్యాటకులు వచ్చేలా ప్రణాళికలు సిద్ధిం చేయాలని సూచించారు.
హైదరాబాద్ నగరంలో హుస్సేన్‌సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య పార్క్, ఎన్టీఆర్ గార్డెన్, ఇందిరా పార్క్‌లను కలుపుతూ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేసే అంశాన్ని పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. టూరిజం అభివృద్ధితో రాష్ట్రానికి మరింత గుర్తింపు, ఆదాయం వచ్చేలా ఈ విధానాన్ని రూపొందించాలని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
మంత్రి జూపల్లి కృష్ణారావు, టూరిజం కార్పొరేషన్ చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ముఖ్యమంత్రి పర్యాటక విధానాన్ని సమీక్షించి పలు సూచనలు చేశారు.