Kurmool | విద్యార్థులలో పెంపొందించాలి – టీజీ వెంకటేష్
కర్నూలు బ్యూరో : కుల, మతాలకు అతీతంగా విద్యార్థుల్లో చిన్నప్పటినుంచి జాతీయ వాదాన్ని పెంపొందించాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. క్లస్టర్ యూనివర్సిటీ సాహితి సదస్సుల ఆధ్వర్యంలో కర్నూలు మాజీ శాసనసభ్యులు గాంధీయవాది టీకేఆర్ శర్మ శత జయంతి ఉత్సవాలను కెవిఆర్ కళాశాలలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన టీజీ వెంకటేష్ మాట్లాడుతూ, పూర్వం కులాలు ఉండేవి కాదని వారి,వారి వృత్తులను పట్టి వర్ణాలు ఏర్పడ్డాయని అన్నారు.
ప్రస్తుత సమాజంలో ఓసీలు మరియు బీసీ తదితర వర్గాల మధ్య దూరం పెరుగుతుందని ఇది మంచిది కాదన్నారు. ప్రతి వర్గాల్లో మంచివారు, చెడ్డవారు ఉంటారని దీనికి ఆ వర్గాన్ని అంతా చెడ్డ వారని లేదా మంచి వారని అనలేమని టీజీ వెంకటేష్ అన్నారు. సమాజంలో వ్యక్తుల మధ్య ఇటువంటి కుల మత భేదాలు ఉన్నంతవరకు అభివృద్ధి చెందలేమని అన్నారు. సమాజంలో మనుషులంతా ఒక్కటే అని, ఒకరికి ఒకరు సహకరించుకుంటూ ముందుకు పోతే మరిన్ని విజయాలు సాధించడానికి , దేశం మరింతగా అభివృద్ధి చెందడానికి ఎంతగానో అవకాశం ఉందన్నారు.
గాంధీజీ ఏ ఒక్క వర్గం కోసం స్వాతంత్ర పోరాటం చేయలేదని దేశ ప్రజలందరికీ కోసం పోరాటం చేశారని గుర్తించుకోవాలన్నారు. అలాగే పొట్టి శ్రీరాములు కూడా తెలుగు వారందరూ కలిసి ఉండాలన్న ఆకాంక్షతోనే ప్రాణత్యాగం చేశారని తెలిపారు.
అయితే ప్రస్తుత పరిస్థితుల్లో వారి జయంతులు జరిగినప్పుడు వారి కుల సంఘాలకు చెందిన వారు తప్ప, మిగిలినవారు నివాళులు అర్పించేందుకు కూడా ముందుకు రావడం లేదని, ఇది ఎంతో శోచనీయ విషయం అని టీజీ అన్నారు. భవిష్యత్తులో ఇటువంటి మహనీయుల త్యాగాలు రాబోయే తరాల వారికి గుర్తు ఉండాలి అంటే, పిల్లల్లో కులమత బేద భావాలు లేకుండా తీర్చి దిద్దాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.
ఈ కార్యక్రమంలో క్లస్టర్ యూనివర్సిటీ వైస్ చాన్సులర్ సాయి గోపాల్ రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చక్రపాణి చంద్రశేఖర కలుగురా విహెచ్పి నాయకులు రాఘవరెడ్డి పీవీ ప్రభాకర్ రావు తదితరులు పాల్గొన్నారు.