Top Story – గోదారిలో చేపల దొంగలు … కొమ్ముకాస్తున్న అధికారులు

  • అభయారణ్యం పరిధి నదిలో వేట
  • దళారుల చేతిలో మత్య్స సంపదకు పెను ముప్పు

దేవిపట్నం, (ఆంధ్రప్రభ) : అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గోదావరిలో దొంగల వేట జోరుగా సాగుతోంది. గుట్టుచప్పుడు కాకుండా గోదావరి నదిలోని మత్స్య సంపదను దోచుకెళ్తున్నారు. దేశంలోని ఎక్కడో నాసిక్‌లో పుట్టి తూర్పు గోదావరి జిల్లాలోని దవలేశ్వరం వద్ద సముద్రంలో కలిసే అఖండ గోదావరి నది పలు రకాల మత్స్య సంపదకు పుట్టినిల్లిగా బాసిల్లుతుంది. ఈ గోదావరిలో ఏజెన్సీలో ఆదివాసీలు, గిరిజనలు, మత్స్యకారులు చేపల వేట చేసుకునేవారు. గోదావరి తీరం వెంబడి గిరిజన గ్రామాల ప్రజలు చేపల వేట ద్వారానే జీవనయానాన్ని కొనసాగించే వారు. అయితే పోలవరం ప్రాజెక్ట్‌ శరవేగంగా పూర్తవుతున్న దశలో పోశమ్మ గండి నుంచి పాపికొండల వరకు ఉన్న గిరిజన గ్రామాలు ఖాళీ చేసి బయటకు వచ్చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

అభయారణ్యం పరిధి నదిలో చేపల వేట
ఇదిలా ఉంటే కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాన్ని నేషనల్‌ పార్క్‌ (అభయారణ్యం) గా ప్రకటించింది. దీంతో ఇక్కడ చేపల వేట కూడా నిషేధం. విశాఖపట్నం జిలా, నక్కపల్లి, కాకినాడ, కొవ్వూరు పట్టణ ప్రాంతాల నుంచి కొందరు దళారులు అధిక సంఖ్యలో పడవలు, వలలతో పాటు చేపల వేటలో ఆరితేరిన వేటగాళ్లను తీసుకు వచ్చి మత్స్య సంపదను ఇతర రాష్ట్రాల్రకు తరలించుకుపోతూ దోసుకుంటున్నారు. శిరమీను అనే జాతీకి చెందిన (అతి చిన్న చేప పిల్లలు ) వలలతో పట్టి వ్యాన్‌లలో తరలిస్తున్నారు. వందల సంఖ్యలో పడవలతో సాగుతున్న వేట ఇలానే కొనసాగితే గోదావరిలో మత్స్య సంపద పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఉంది.

కొమ్ముకాస్తున్న అధికారులు
గోదావరి నదిలో అది కూడా అభయారణ్య నేషనల్‌ పార్క్‌ పరిధిలోకి వచ్చే గోదావరి కేటుగాళ్ళ చేపల వేటకు పాల్పడుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో చేపల వేటకు అధికారులు కొమ్ముకాస్తున్నారనే విమర్శలు సైతం లేకపోలేదు. అధికారులు కూడా కొమ్ము కాస్తుండటంతో మత్స్య సంపద ఉనికికే పెను ప్రమాదం ఏర్పడింది. దీనిపై ఉన్నతాధికారులు స్పందించి గోదావరిలో మత్స్య సంపదను కాపాడాలని పలువురు కోరుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *