TG | అర్హులకు పథకాలు అందించకపోవడం సరికాదు
హైదరాబాద్, ఆంధ్రప్రభ : రైతు భరోసా, ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్ కార్డులను అర్హులందరికీ అందించకపోవడం సరైంది కాదని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. రాష్ట్రంలో 12,991 గ్రామ పంచాయతీలు ఉండగా, మండలానికి ఒక గ్రామం చొప్పున 561 గ్రామాలను మాత్రమే ఎంపిక చేయడమేంటని ప్రశ్నించారు.
ఈ మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి బండి సంజయ్ బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రవ్యాప్తంగా అర్హులైన 70 లక్షల మంది రైతులుంటే ఈ రోజు వరకు 65 లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులే జమ చేయకపోవడం బాధాకరమన్నారు. పది లక్షల మంది వ్యవసాయ కూలీలుంటే.. 9,80,000 మంది వ్యవసాయ కూలీల ఖాతాల్లో డబ్బులు వేయకపోవడమేంటని నిలదీశారు.
40 లక్షల కార్డులు ఇస్తామని…
40 లక్షల కొత్త రేషన్ కార్డులిస్తామని 42,267 మందిని మాత్రమే గుర్తించడం హాస్యాస్పదంగా ఉందని బండి సంజయ్ అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 30 లక్షల కుటుంబాలు అర్హులైనప్పటికీ, నేటికీ ఒక్కరంటే ఒక్కరికి కూడా ఇంటిని నిర్మించకపోవడం సిగ్గు చేటన్నారు. ఇళ్ల నిర్మాణం కోసం రాష్ట్ర బడ్జెట్లో రూ.7 వేల కోట్లకు పైగా కేటాయింపులు చేసినా.. నయాపైసా ఖర్చు చేయకపోవడం దారుణమన్నారు.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటయ్యాక అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులు ఎవరూ కూడా ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోవడం బాధాకరమన్నారు.
ముఖ్యమంత్రే ఇచ్చిన హామీలనే అమలు చేయలేకపోతే.. మీ నేతృత్వంలో పనిచేసే అధికారులు ఏ విధంగా జవాబుదారీతనంతో పనిచేయగలరు? ఆరు గ్యారంటీలను అమలు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. ఇకనైనా అర్హులకు రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, రేషన్ కార్డులు, ఇళ్లను అందించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.