Missing | మహాకుంభ్‌లో మహాద్బుతం!.. ఆయనే మా అయన అంటున్న మహిళ …
27ఏళ్ల తర్వాత కనిపించిన వ్యక్తి
ఆనవాళ్లతో భర్తను గుర్తించిన భార్య
తాను కాదంటున్న అఘోరి బాబా
డీఎన్ఏ టెస్టు చేపించాలని పోలీసులకు ఫిర్యాదు
ప్రయాగ్‌రాజ్, ఆంధ్రప్రభ:
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాకు ఇసుకవేస్తే రాలనంత జనం వస్తున్నారు. పుణ్య స్నానాలు చేయడానికి కోట్లాది మంది చేరుకుంటున్నారు. ఇంత రద్దీ ఉన్న ప్రదేశంలో కొంత మంది తప్పిపోయే పరిస్థితులు ఉంటాయి. అయితే.. కుటుంబంతో వచ్చినవారు తప్పిపోకుండా ఒకరికొకరు తాడుతో కట్టుకుని జాగ్రత్త పడుతున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి. కాగా, 27ఏళ్ల క్రితం ఇట్లానే కుంభమేళాకు వచ్చి తప్పిపోయిన ఓ వ్యక్తి ఇప్పుడు జరుగుతున్న మహా కుంభమేళాలో కనిపించాడు. దీంతో ఆ కుటుంబం దీన్ని మహాద్భుతంగా భావిస్తోంది. ఇన్నేళ్ల తర్వాత ఆ వ్యక్తిని అతడి కుటుంబ సభ్యులు గుర్తించడంతో అంతా ఆశ్యర్యంలో మునిగిపోయారు.. అయితే.. తాను వారి కుటుంబ సభ్యుడిని కాదని ఆ వ్యక్తి చెప్పడంతో కథ అడ్డం తిరిగింది.
27 ఏళ్ల క్రితం అదృశ్యం
జార్ఖండ్‌కు చెందిన గంగాసాగర్ యాదవ్ అనే వ్యక్తికి భార్య ధన్వాదేవి, కుమారులు కమలేశ్, విమలేశ్ ఉన్నారు. 1998లో గంగాసాగర్ ఉన్నట్టుండి అదృశ్యమయ్యాడు. భర్త కనిపించకపోయే సరికి కంగారుపడిన ధన్వా దేవి పలు ప్రాంతాల్లో గంగాసాగర్ ఆచూకీ కోసం వెతికింది. అయినా అతడు కనిపించలేదు. కొన్ని నెలల అన్వేషణ తర్వాత గంగా సాగర్‌పై ఆశలు వదులుకున్న భార్య, తన పిల్లలను కష్టపడి పెంచి పెద్ద చేసింది. కాగా, గంగాసాగర్ సోదరుడు మురళి తెలిపిన వివరాలు ప్రకారం, తాజాగా మహా కుంభమేళాకు హాజరైన ధన్వాదేవి బంధువులు అక్కడ ఓ అఘోరిని చూసి షాక్ అయ్యారు. ఆ అఘోరి అచ్చం గంగాసాగర్లా ఉండడంఃతో ఫొటో తీసి, ధన్వాదేవికి పంపించారు. ఫొటో చూడగానే భర్తను గుర్తించిన ధన్వాదేవి తన పిల్లలు, కుటుంబ సభ్యులతో అక్కడికి చేరుకుంది.
భర్తను గుర్తించింది ఇలా..
గంగాసాగర్ నుదిటిపై మచ్చ, ఎత్తు పళ్లు, మోకాలిపై దెబ్బలు చూసి తన భర్తను ధన్వాదేవి గుర్తించింది. తమతో పాటు ఇంటికి రావాలని కోరింది. వారిని చూసిన అఘోరి విచిత్రంగా ప్రవర్తించాడు. తాను వారణాసికి చెందిన అఘోరినని చెప్పాడు. తన పేరు బాబా రాజ్ కుమార్ అని పేర్కొన్నాడు. ధన్వాదేవి కుటుంబంతో తనకేం సంబంధం లేదని అతను వాదించాడు.
అన్నను గుర్తుపట్టిన తమ్ముడు
గంగాసాగర్ యాదవ్ తమ్ముడు మురళి యాదవ్ సైతం తన అన్నను గుర్తించాడు. అయినా అఘోరి మాత్రం అందుకు అంగీకరించలేదు. చివరకు సదరు కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. కుంభమేళా ముగిసే వరకూ ఇక్కడే ఉంటామని, తమ భర్తకు అవసరమైతే డీఎన్‌ఏ పరీక్షలు చేయిస్తామని ధన్వాదేవి తెలిపారు. డీఎన్ఏ పరీక్షలో అఘోరి గంగాసాగర్ కాదని తేలితే ఆయనకు క్షమాపణలు చెబుతామని మురళి యాదవ్ పేర్కొన్నారు. ఇక.. ధన్వాదేవి కుటుంబ సభ్యుల్లో కొందరు కుంభమేళా నుంచి ఇంటికి వచ్చారు. మరికొందరు కుంభమేళాలోనే ఉండి గంగాసాగర్‌ను నిశితంగా పరిశీలిస్తున్నారు. ఇదిలా ఉంటే, గంగాసాగర్ ఇంటి నుంచి వెళ్లిపోయేసరికి అతడి పెద్ద కొడుకు వయసు కేవలం రెండేళ్లు. చిన్న కుమారుడు ఇంకా తల్లి గర్భంలో ఉన్నట్టు వారి కుటుంబ సభ్యులు తెలిపారు.